డబ్బుతో ప్రజలను కొనుగోలు చేయోచ్చన్న భ్రమల్లో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ

Bhatti Vikramarka Fire On TRS, BJP. అధికారం, డబ్బు అహంకారంతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై బిజెపి అడుగులు వేస్

By Medi Samrat  Published on  18 Sept 2022 6:15 PM IST
డబ్బుతో ప్రజలను కొనుగోలు చేయోచ్చన్న భ్రమల్లో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ

అధికారం, డబ్బు అహంకారంతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై బిజెపి అడుగులు వేస్తూ అణగదొక్కుతున్నదని స్పీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అధికారానికి, డబ్బుకు అడ్డులేదన్న అహంభావపూరిత వాతావరణంలో తెలంగాణ పై బిజెపి దాడి చేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు‌. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో పిఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బూత్ కమిటీల ఇన్చార్జిలకు, సమన్వయకర్తలకు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార ఆస్త్రాల గురించి దశ, దిశ నిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలను అనగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో ఇక్కడి ప్రజలు మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారే తప్పా తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డకు లేదన్నారు. డబ్బు అధికారం ఉందన్న అహంకారంతో విర్రవీగుతున్న బిజెపికి ఇక్కడి ప్రజలు అదే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఇక చాలు అని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. దోపిడి, అవినీతికి పాల్పడుతూ, ఉన్న వనరులను ప్రజలకు ఇవ్వకపోగా.. తెచ్చుకున్న తెలంగాణను టిఆర్ఎస్ నవ్వుల పాలు చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ సమాజంలో తలెత్తుకొని బతకాలన్న బహుజనుల ఆత్మగౌరవం టిఆర్ఎస్ పాలనలో భంగపాటయిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన టిఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యం ప్రలోభాలకు తెర లేపిందన్నారు. అధికారం, డబ్బు అహంకారాన్ని ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ బిజెపి పార్టీల మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను డబ్బుతో లొంగదీసుకోవచ్చన్న భ్రమలతో ఉందన్నారు. వందల కోట్లు తీసుకొచ్చి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరించే ఈ పార్టీలకు నిజాం గతే పడుతుందన్నారు.

సామ్యవాద, లౌకికవాద భావజాలం కలిగిన ప్రజలను డబ్బుతో కొనుగోలు చేయొచ్చన్న భ్రమల్లో ఉన్న టిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెంప చెల్లుమనిపించే విధంగా.. మునుగోడు ప్రజలు సిద్ధాంతాల భావజాలానికి కట్టుబడి ఉంటారే తప్పా అమ్ముడుపోరు అన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.

పేదలతో మమేకమై సామాన్యులతో కలిసిపోయి ప్రతి ఇంటి మనిషిగా ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్న దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తనయురాలు స్రవంతి మునుగోడు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిందన్నారు. మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను దశా దిశ చేయబోతుందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మునుగోడు ప్రజల నిర్ణయాత్మకమైన తీర్పు పైనే ఆధారపడి ఉన్నందున రాష్ట్ర ప్రజల సంక్షేమంగా మీ ఓటు ఉండాలని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను అణ‌గదొక్కాలని దోపిడీకి పాల్పడాలని చూస్తున్న బిజెపి, టీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఏ నోటుకు అమ్ముడుపోకుండా మునుగోడు ప్రజలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు.


Next Story