కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్వయంగా కలుస్తున్నారు. కొందరు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై చర్చించేందుకే సీఎంను కలిశామని చెబుతున్నారనుకోండి.
ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు తదితరులు రేవంత్‌ని ఆయన నివాసంలో స్వయంగా కలిశారు. కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం సాగినా.. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సమస్యలపైనే తమ చర్చలు సాగాయని ఓ క్లారిటీ ఇచ్చారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్‌ను కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కూడా ఆయన వెంట ఉన్నారు. వారి చర్చలు కేవలం నియోజకవర్గ విషయాలపై మాత్రమే జరిగాయని అంటున్నారు. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వెంకట్‌రావు రేవంత్‌తో భేటీ అయ్యారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు వినిపించినా.. అవేవీ నిజమవ్వలేదు.