ప్రభుత్వ హామీలు, ఆచరణకు పొంతన లేదు..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డకి బహిరంగ లేఖ రాశారు.

By Knakam Karthik  Published on  29 Jan 2025 3:35 PM IST
Telangana, Congress, Cm Revanth, Bandi Sanjay Letter, Bjp

ప్రభుత్వ హామీలు, ఆచరణకు పొంతన లేదు..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని ప్రకటించి అందులో, 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చకపోవడం బాధాకరమని బండి సంజయ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.20 వేల కోట్లను జమ చేస్తామని చెప్పారని బండి సంజయ్ తన లేఖలో గుర్తు చేశారు. అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని చెప్పారని తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్నబియ్యం కూడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే ఈ ఏడాది నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇవన్నీ జనవరి 26 నుండే అమలు చేస్తామని, ఈనెలాఖరుకల్లా ఆయా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులను కూడా జమ చేస్తామని వాగ్దానం చేశారు.

కానీ మీరు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేకపోయారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేసి పైన పేర్కొన్న నాలుగు పథకాల లబ్ది దారులను గుర్తించి వాటికి సంబంధించి మంజూరు పథకాలను మంజూరు చేయడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులుంటే, నేటి వరకు 4,41,911 మంది రైతుల ఖాతాల్లోనే ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేయడం బాధాకరం. అట్లాగే వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీల కుటుంబాల బ్యాంకుల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిన మీరు నేటి వరకు 20 వేల 336 మంది ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారు. మిగిలిన 9 లక్షల 79 వేల మందికిపైగా కూలీలకు రైతు భరోసా పైసలే ఇవ్వకపోవడం దుర్మార్గం అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చినా నేటికీ వాటిని అమలు చేయడంలో మీరు దారుణంగా విఫలమయ్యారు. ఆశ్చర్యపోయే విషయమేమిటంటే... ఈ ఆర్ధిక సంవత్సరంలో (2024-25) ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.7 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిన ప్రభుత్వం... నేటికీ అందులో నయాపైసా ఖర్చు చేయలేదు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలకు, ఆచరణకు పొంతన లేదని, ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన హామీలన్నీ డొల్ల అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో మీరే ఆలోచించండి. ఈ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు మీకు, ముఖ్యమంత్రి పదవికి ఏ మాత్రం వన్నె తెచ్చేది కాదంటూ బండి సంజయ్ లేఖలో తెలిపారు.

Next Story