రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్‌ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్

ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.

By Knakam Karthik  Published on  21 Feb 2025 1:02 PM IST
Telangana News, Bandi Sanjay, Cogress Government, Brs,Bjp, Cm Revanth, LRS

రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్‌ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్

ఎల్‌ఆర్ఎస్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త దుకాణం పెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టి ఇప్పుడేమో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని సెటైర్ వేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ భయంతోనే ఎమ్మెల్సీ పోటీ తప్పుకుంటే.. హస్తం పార్టీకి అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. దేశంలో అధికార పార్టీకి అభ్యర్థికి కరువు అవ్వడం కేవలం తెలంగాణలోనే చూస్తున్నామని సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు బీజేపీవైపే ఉన్నాయని.. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. కులగణన విషయంలో కాంగ్రెస్ సర్కార్ కొరివితో తలగోక్కుందని కామెంట్స్ చేశారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలిపారని, ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కేటగిరీ నుంచి వారిని తొలగించి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Next Story