సొంత పనుల కోసమే ఢిల్లీకి కేసీఆర్.. పతనం మొదలైంది : బండి సంజయ్
Bandi Sanjay says fight is going on between KCR Family Members.సొంత పనుల కోసమే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడని..
By తోట వంశీ కుమార్
సొంత పనుల కోసమే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కోసం వెళ్లినట్లు ప్రజలను భ్రమల్లో ముంచే ప్రయత్నం చేశాడని.. బీజేపీ ప్రతిష్ఠను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. శనివారం బండ్లగూడలో రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బీజేపీ వ్యవహారాల సంస్థాగత ఇన్‌చార్జి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఉదయం పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు.
తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి రాజ్యం, నియంత పాలన, కుటుంబ పాలనపై వస్తోన్న తీవ్ర వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నాడన్నారు. అందులో బాగంగానే మొన్న డిల్లీ పర్యటనకు వెళ్లి.. తనకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్న దుష్ర్పచారం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అసలు కేసీఆర్ ప్రధాని అపాయింట్‌మెంటే అడగనేలేదని పీఎంవో చెప్పడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్ధమైందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీకి పోయిన కేసీఆర్.. అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేశాడన్నారు.
తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. రక్తం దారపోసేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమయిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో కూడా కొట్లాట మొదలయిందని అన్నారు. తమను సీఎంను చేయాలని కొడుకు, కూతురు, అల్లుడు ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతుకను పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారని చెప్పారు. సీఎం పోకడల కారణంగా అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో బీజేపీ అధికారంలోని రానుందనే ధీమాను వ్యక్తం చేశారు.