బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈనెల 24 నుంచి బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పార్టీ పరంగా ఆరు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ సైనికాధికారులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. వేల మందితో పాదయాత్ర ప్రారంభానికి కాషాయపార్టీ ఏర్పాట్లు చేసుకుంది. నిజానికి సంజయ్ పాదయాత్ర ఆగస్ట్ 9న ప్రారంభం కావాల్సి ఉండగా.. రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. కల్యాణ్‌సింగ్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో నడుచుకున్నారని.. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కల్యాణ్ సింగ్ బతికి ఉన్నంతకాలం అయోధ్యలో శ్రీరాముడి భవ్య రామాలయం కోసం తపించారని తెలిపారు. యూపీకి రెండు సార్లు సీఎంగా, రాజస్థాన్ గవర్నర్‌గా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన మరణం బీజేపీకి తీరని లోటని పేర్కొన్నారు.