గ్రూప్-1 వివాదంపై TGPSCకి బండి సంజయ్ లేఖ
బండి సంజయ్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు.
By Knakam Karthik
గ్రూప్-1 వివాదంపై TGPSCకి బండి సంజయ్ లేఖ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్ 1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతోపాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఝప్తులను, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత టీజీఎస్పీఎస్సీ పైన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా గ్రూప్ 1 పరీక్ష, ఫలితాలకు సంబంధించి ఈ కింది సమాచారాన్ని వారం రోజుల్లో పంపగలరని కోరుతూ పేజీల లేఖ రాశారు.
అందులో ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతోపాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని ఛైర్మన్ ను కోరారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో... టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని నిర్ణయించారు. అంతిమంగా గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని భావిస్తున్న బండి సంజయ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అవినీతి, అక్రమాలు, తప్పిదాలకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు జరిగేలా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పలు సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని నివ్రుత్తి చేయాల్సిందిగా టీజీపీఎస్సీ ఛైర్మన్ ను కోరారు.