ఇన్ని రోజులు ఈటెల‌ అవినీతి కనిపించలేదా.? మిగతా వారిపై చర్యలేవి.?

Bandi Sanjay Fires On KCR. ఈటెలను మంత్రి ప‌ద‌వి నుండి త‌ప్పించ‌డంపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు.

By Medi Samrat  Published on  1 May 2021 11:51 AM GMT
ఇన్ని రోజులు ఈటెల‌ అవినీతి కనిపించలేదా.? మిగతా వారిపై చర్యలేవి.?

ఈటెలను మంత్రి ప‌ద‌వి నుండి త‌ప్పించ‌డంపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మంత్రి ఈటల రాజేందర్ అవినీతి కనిపించలేదా? అని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డిపై వ‌చ్చిన‌ కబ్జా ఆరోపణలు వాస్తవం కాదా అని ప్ర‌భుత్వాన్ని నిలదీశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కబ్జాలను బీజేపీనే బయటపెట్టింద‌ని.. కబ్జాలు చేసిన మిగతా మంత్రులపై చర్యలేవి? అని సంజయ్‌ ప్రశ్నించారు. అమీన్‌పూర్‌ భూముల స్కాం, ఎమ్మెల్యేలపై డ్రగ్స్‌ కేసు, 111 జీవో ఉల్లంఘన వీట‌న్నింటిపై చర్యలేవి? అని ప్ర‌శ్న‌లు సంధించారు. కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని ప్ర‌భుత్వ పెద్ద‌లు పక్కదారి పట్టించారని, తెలంగాణలో పరిస్థితి గంభీరంగా ఉందన్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్‌ శాఖలేని మంత్రిగా మారారు. మంత్రి ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల‌పై విజిలెన్స్‌, రెవెన్యూఅధికారులు విచార‌ణ చేప‌ట్టారు. కాసేపట్లో సీఎస్‌, ఏసీబీ డీజీ సంబంధిత నివేదికను సీఎం కేసీఆర్‌కు అందచేయనున్నారు.


Next Story
Share it