సీఎం కేసీఆర్ ఎంత ప్ర‌య‌త్నించినా బీజేపీని ఏమీ చేయ‌లేరు

Bandi Sanjay Fires on CM KCR.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక చెల్ల‌ని రూపాయి అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2022 1:04 PM IST
సీఎం కేసీఆర్ ఎంత ప్ర‌య‌త్నించినా బీజేపీని ఏమీ చేయ‌లేరు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక చెల్ల‌ని రూపాయి అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. కేసీఆర్ మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని, ఆయన ఎంత ప్ర‌య‌త్నించినా బీజేపీని ఏమీ చేయ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో బండి సంజ‌య్ మాట్లాడుతూ.. కేసీఆర్ బ‌హిరంగ స‌భ ఎందుకు పెట్టాడో అర్థం కావ‌డం లేద‌న్నారు. సీఎం ప‌ర్య‌ట‌న‌లో నేప‌థ్యంలో నిన్న జ‌న‌గామ‌లో బీజేపీ నాయ‌కుల‌ను ముంద‌స్తు అరెస్ట్ చేశార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

సీఎం సభ అంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి, చేయ‌బోయే అభివృద్ధి గురించి చెప్పాల‌ని అయితే.. కేసీఆర్ మాత్రం త‌న ప్ర‌సంగం మొత్తం బీజేపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేసి విమ‌ర్శించార‌న్నారు. ఏడేళ్ల‌లో జ‌న‌గామ జిల్లాను ఏమీ అభివృద్ది చేశారో కేసీఆర్ చెప్ప‌లేద‌ని ఆరోపించారు. సీఎం బాష‌ను చూసి ప్ర‌జ‌లు అస్య‌హించుకుంటున్నార‌న్నారు. కేసీఆర్ మాట‌ల‌ను ప్ర‌జ‌లెవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. నిన్నటి మీటింగులో మోదీ గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెపుతారని ఆశించామని అయితే.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పడానికే ఆయన సభలు పెడుతున్నారన్నారు.

ఇక తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించినా.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఎందుకు వెళ్ల‌లేదో యాదాద్రిలో ఈ రోజు జ‌రిగే స‌భ‌లో స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగసభల వద్ద కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వ‌హిస్తామ‌న్నారు. కేసీఆర్ కోస‌మే ఈ స్కీమ్ తప్పకుండా తీసుకొస్తామని చెప్పారు.

Next Story