తప్పేముంది.?.. అమిత్ షాకు చెప్పులు అందించ‌డంపై బండి సంజ‌య్‌

Bandi Sanjay Fire On TRS. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానని ప్రగల్భాలు పలికిన

By Medi Samrat  Published on  22 Aug 2022 2:36 PM GMT
తప్పేముంది.?.. అమిత్ షాకు చెప్పులు అందించ‌డంపై బండి సంజ‌య్‌

దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి ''లిక్కర్ ఫ్రంట్'' పెట్టేందుకే ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నేతలతో చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. పంజాబ్ లో ని డ్రగ్స్ ను తెలంగాణకు విస్తరింపజేయడానికి, తెలంగాణలోని లిక్కర్ సామ్రాజ్యాన్ని పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలకు విస్తరింపజేసుకునేందుకే పరస్పర చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రామచంద్ర పిళ్లై, శరత్, స్రుజన్ రెడ్డి, అభిషేక్ లు కేసీఆర్ కుటుంబ బినామీలని అన్నారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే కుటుంబం బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు.

అమిత్ షాకు చెప్పులందించడంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై ధ్వజమెత్తారు. ''అమిత్ షా పెద్దాయన, గురువు. తండ్రిలాంటి వాడు. చెప్పులందిస్తే తప్పేముంది? గురుద్వారాలో చెప్పులు శుభ్రం చేస్తాం. ఇందాక పాదయాత్రలో ఓ పెద్దావిడ పోలియోతో ఇబ్బంది పడుతుంటే చెప్పులు తొడిగా.. తప్పేముంది? అయినా అమిత్ షా, మోదీలను కలిసేందుకు, వారిని టచ్ చేసేందుకు ఎంతో మంది ఎదురుచూస్తుంట‌రు. ఎందుకంటే వారిని స్ప‌ర్శిస్తే దేశభక్తి ఎక్కవైతది. ఎంతో ధైర్యం కలుగతది. అదే కేసీఆర్ ను తాకితే ఏమొస్తది.. మందు, సిగరేట్ వాసన తప్ప''అని ఎద్దేవా చేశారు.

లిక్కర్ దందాపై సీబీఐ విచారణ చేస్తోంది. ఈ స్కాంలో కేసీఆర్ కుటుంబం దోషులుగా తేలుతారని అన్నారు. 'అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్' కేవలం 'RRR' సినిమాపై మాత్రమే కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ముగ్దుడై మాత్రమే కలిశారని అన్నారు.


Next Story