కాంగ్రెస్‌లో అభ్యర్థులను కేసీఆరే ఎంపిక చేస్తారు: బండి సంజయ్

కాంగ్రెస్‌లో అసెంబ్లీ ఎన్నికలకు 30 మంది అభ్యర్థులను కేసీఆరే డిసైడ్‌ చేస్తారని అన్నారు బండి సంజయ్.

By Srikanth Gundamalla  Published on  18 Jun 2023 1:04 PM IST
Bandi Sanjay, CM KCR, BJP, Hyderabad, Telagana, Congress

కాంగ్రెస్‌లో అభ్యర్థులను కేసీఆరే ఎంపిక చేస్తారు: బండి సంజయ్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ నాయకులు విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌లో పలువురు అభ్యర్థులను కేసీఆర్‌ ఎంపిక చేసి నిలబెడతారని ఆరోపణలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

కాంగ్రెస్‌లో అసెంబ్లీ ఎన్నికలకు 30 మంది అభ్యర్థులను కేసీఆరే డిసైడ్‌ చేస్తారని అన్నారు బండి సంజయ్. పలువురు ప్రజాప్రతినిధులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల దుస్తుల మీద కాకుండా.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. మహమూద్‌ అలీ అసలు ఉన్నారా అని ప్రశ్నించారు. ఆయన హోంమంత్రి అన్న విషయం రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు కావాల్సిన నిధులను కేంద్రం అందించిందని చెప్పారు. కేంద్రం సాయం చేయడం లేదని ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమని.. మరి చర్చకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారా అని బండి సంజయ్ సవాల్‌ విసిరారు. పరేడ్‌ గ్రౌండ్‌లో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాగా.. హైదరాబాద్‌ దేశ రెండో రాజధాని అంశంపైనా బండి సంజయ్ స్పందించారు. ఈ విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని చెప్పారు. తెలంగాణకు ఏది మంచిదో దాని కోసం తెలంగాణ బీజేపీ కచ్చితంగా పని చేస్తుందని చెప్పారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

Next Story