సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on  8 Nov 2024 2:06 PM IST
సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి.. ఆరు గ్యారెంటీల మీద పాదయాత్ర చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు అందుకే కొత్తగా ఏడు గ్యారెంటీలనే రాగం ఎత్తుకున్నారన్నారు.

కేటీఆర్ ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకటేన‌న్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో సయోధ్య ఉందన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డికి మధ్యలో సంధి కుదరకపోతే జన్వాడ ఫామ్ ఎందుకు కూల్చలేద‌ని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ గురించి ఆలోచించెటోల్లు ఎవరు లేరన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది.. బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ మోడ్ కు పరిమితం అయ్యారన్నారు. ఆటో కార్మికులు, సర్పంచులు నాశనం అయ్యిందే కేసీఆర్ పాలన వల్ల అన్నారు. లీగల్ నోటీసులకు కేటీఆర్ భయపడుతున్నారా..? నేనిచ్చిన నోటీసులకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఎక్కడ దాక్కున్నారని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ లో ఎంతో కొంత క్రెడిబులిటీ ఉన్న వ్యక్తి హరీష్ రావు.. కేటీఆర్ కు కళ్ళు తలకెక్కాయ‌న్నారు. కేటీఆర్ కు ఎందుకంత అహంకారం.. ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడని అనుకుంటున్నాడా..? అని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటే అంటూ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ గత చరిత్ర ఏంది.. ప్రస్తుత చరిత్ర ఏందీ..? గతంలో ఆస్తులు ఎంత, ఇప్పుడెంత..? గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Next Story