కేసీఆర్ సభకు రావడంతో ఎవరికి వారు మార్కులు కొట్టేయాలని మాట్లాడుతున్నారు
కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని తప్పులు- అప్పులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు.
By Medi Samrat
కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని తప్పులు- అప్పులేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ 12 నెలల పాలనపై చర్చకు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. దొంగలు, రాబంధువుల లెక్క తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంది.. యువకుల బలిదానాలు చూడలేకే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో.. కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి చెందిదే తప్పా.. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అమరుల ఆశలు, ఆకాంక్షలను అమలు పరిచేవిధంగా పనిచేస్తున్నామన్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియామకం పారదర్శకంగా చేస్తున్నామన్నారు.
12 నెలల కాలంలోనే 55వేల ఉద్యోగాలు కల్పించాం.. రైతులకు 21వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం.. ఎన్నో ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని బీసీ కుల గణనను చేసినం.. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు, ఐదు వందలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. టీజీపీఎస్సీ పేపర్లు లీకై నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఎస్ ఎల్ బీసీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు.
గవర్నర్ ప్రసంగ సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యుల తీరు బాధాకరం అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి, రూల్స్ తెలిసి కూడా వ్యవహరించిన తీరు శోచనీయం అన్నారు. బీఆర్ఎస్ లో కుటుంబ సభ్యుల మధ్య పోటీ నడుస్తోంది. కేసీఆర్ సభకు రావడంతో.. ఎవరికి వారు ఎక్కువ మార్కులు కొట్టేయాలని మాట్లాడుతున్నారు.. కొడుకు.. బిడ్డా.. అల్లుడు ఎవరికీ వారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరి వర్గం ఎమ్మెల్యేలు వాళ్ల గ్రూప్ గా మార్కులు కొట్టేయడానికి అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వారికి సర్ధిచెప్పాల్సిన కేసీఆర్.. మౌనంగా ఉంటూ ప్రోత్సహించడం సరికాదన్నారు. కొత్తగా సభకు వచ్చే సభ్యులకు ఏం నేర్పుతున్నారో అర్థం కావడం లేదన్నారు.