రేవంత్ ఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఓ రోశయ్యలా మిగిలిపోతారు : బాల్క సుమన్

చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  28 Feb 2024 11:01 AM GMT
రేవంత్ ఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఓ రోశయ్యలా మిగిలిపోతారు : బాల్క సుమన్

చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారని.. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పథ‌కాలు వర్తింప చేయాలన్నారు. 40 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కు మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సవాల్ విసిరే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. 2018 కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అనలేదా అని ప్ర‌శ్నించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి అనలేదా అని నిల‌దీశారు.

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు వెళ్లే సత్తా వుందా అని స‌వాల్ విసిరారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని ఆరోపించారు.

తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క్రిష్ణా నదిపై వున్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు రేవంత్ రెడ్డిని పొగడాలా అని దుయ్య‌బ‌ట్టారు. 4000 పింఛన్, రైతు రుణమాఫీ ఎటు పోయిందని ప్ర‌శ్నించారు. బూతు పురాణాలు, అబద్ధాల ప్రచారం రేవంత్ రెడ్డి చేస్తున్నారని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల దృష్టిని మరల్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. రేవంత్ రెడ్డి ఏ.డీ (అటెన్షన్ డైవెర్షన్ )లా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు.

అసెంబ్లీ, సచివాలయం, మేడారం జాతర ఎక్కడైనా రేవంత్ రెడ్డి భాష ఒకటే విధంగా వుందని ఎత్తి చూపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరు అన్నారు.. కాంగ్రెస్ పార్టీలోనే పది గుంపులు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉండి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. తెలంగాణను బంగారు పళ్ళెంలో పెట్టి రేవంత్ రెడ్డికి అప్పగించామన్నారు.

రైతు బంధు డబ్బులు మంత్రుల ఖాతాల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఏఏ కంపెనీలకు డబ్బులు చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేస్తారా అని ప్ర‌శ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను మరమ్మతులు చేయాలని.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీళ్ల కోసం రైతులు రోడ్లు ఎక్కుతున్నారని అన్నారు.

తక్షణమే డీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 1 లో 1500 ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 1500 ఉద్యోగాలు ఎటు వెళ్లాయని ప్ర‌శ్నించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే సోయితో మాట్లాడాలని సూచించారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని.. గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యల ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంత మందిని బెదిరిస్తే అంత తిరుగుబాటు వస్తుందన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు ,వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కొన్నామ‌న్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ప్రజలు గ్రహిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారోనని సందేహం వ్య‌క్తం చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. కానీ రేవంత్ ఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఓ రోశయ్య లా మిగిలిపోతాడని అన్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చి తన పరిపాలనతో ప్రజల్లో ముద్ర వేసుకున్నారని కొనియాడారు

Next Story