అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి : బాల్క సుమన్

కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.

By Medi Samrat  Published on  7 Oct 2024 10:09 AM GMT
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి : బాల్క సుమన్

కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ లాగా మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా రేవంత్ రెడ్డి మారారని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభ ఏర్పాటు చేశారు. యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. గ్రూప్-1 నియామకాలు ఏప్రిల్ 2024లో చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవేమి చేయ‌కుండా యువతను నమ్మించి మోసం చేశారని అన్నారు.

ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీఆర్ఎస్ చెప్పింది. మేము అధికారంలో ఉన్నప్పుడు లక్షా 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ప్రైవేటు రంగంలో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో వచ్చాయన్నారు. రెండు లక్షల 27 వేల ఉద్యోగాలకు బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. సీఎం మాటలు విని దయ్యాలు సిగ్గుపడతాయన్నారు.

టీచర్ ఉద్యోగాలకు మేము 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 5 వేల ఉద్యోగాలు యాడ్ చేసింది. ఆరు గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేయడం లేదు. రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని అన్నారు. రైతులందరికి రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటెన్షన్ డైవర్షన్ చేస్తోందన్నారు.

నిరుద్యోగుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టిందన్నారు. మూటలు సర్దుకుని ఢిల్లీకి మూటలు పంపడంపై రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అభయహస్తం నిరుద్యోగుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఎందుకు కలవడం లేదు.. ఒక్క మంత్రి అయినా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా అని ప్ర‌శ్నించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల చుట్టూ తిరిగారు.. రాష్ట్రం అంతా నిరుద్యోగ యాత్రలు చేయించారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం, భట్టి డిప్యూటీ సీఎం అయ్యార‌ని.. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story