బీఆర్ఎస్‌కు బాలసాని రాజీనామా
బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను
By Medi Samrat
బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌కు పంపారు. బాలసాని లక్ష్మీనారాయణ 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన రెండుసార్లు టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై చట్ట సభల్లో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.
2023 తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం బీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి ఆయనను తప్పించడంతో మనస్థాపం చెందిన బాలసాని లక్ష్మినారాయణ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2009లో ఆయన టీడీపీ నుండి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థల స్థానం నుండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి సిపిఐ అభ్యర్థీ పువ్వాడ నాగేశ్వర్ రావుపై 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తుంది.