వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తాజాగా భాస్కర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దీనితో ఆయనను హుటాహుటీన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఆ తరువాత భాస్కర్ రెడ్డిని తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించినట్లు తెలుస్తుంది. వైద్యుల సూచన మేరకు జైలు అధికారులు శనివారం ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చేర్పించారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కోర్టులో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా కేసులో సీబీఐ విచారణ ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని కోర్టులో వాదనలు వినిపించారు. దస్తగిరి అనుచరుడు మున్నా స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని.. మున్నా బ్యాంక్ లాకర్ నుంచి రూ.46 లక్షలు రికవరీ చేశారని కోర్టుకు తెలిపారు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ను సీబీఐ అడ్డుకోలేదని.. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి.. సీబీఐ తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్ రాయించుకుందని కోర్టులో అవినాష్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటలు పాటు అవినాష్ రెడ్డి న్యాయవాది తన వాదనలు వినిపించారు.