హైదరాబాద్, మార్చి 12: ఈ నెల 13న జరిగే మహబూబ్ నగర్ - రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. స్టాచుచరి, నాన్ స్టాచుచరి పత్రాలతో పాటు బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్, ఓటరు జాబితాను ఎన్నికల సిబ్బంది పరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. పోలింగ్ సమగ్ర నిర్వహణ కోసం పోలింగ్ రోజు ఈ నెల 13 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాలో మొత్తం 29,720 ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 12 సెక్టరోల్ అధికారులను, 29 మంది అబ్జర్వర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ ల వద్ద పోలీసు బందోబస్తు, ఓటర్లకు మౌలిక సదుపాయాలు త్రాగునీరు, టెంట్లు ఏర్పాటు, దివ్యాంగుల కోసం ర్యాంపు లను ఏర్పాటు చేశామని తెలిపారు. రిసెప్షన్ సెంటర్ ను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది తమ పోలింగ్ సామాగ్రితో పాటు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారని వెల్లడించారు.