నామినేషన్ వేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లను దాఖలు చేశారు
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 6:44 AM GMTఅమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లను దాఖలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి లు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అంతకముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
గవర్నర్ కోటా కింద రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌రావు, ఫరూక్ హుస్సేన్ పదవీ కాలం మే నెలలో పూర్తి కానుంది. వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నామినేట్ చేయాల్సి ఉంది. దీనిపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ ఆమోదం తరువాత అభ్యర్థుల ఫైల్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వద్దకు వెళ్లనుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, తదితరులు ఉన్నట్లు సమాచారం.