ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థులును ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్‌రావు, ఫరూక్ హుస్సేన్ పదవీ కాలం మే నెలలో పూర్తి కానుంది. వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నామినేట్ చేయాల్సి ఉంది. దీనిపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కవిత అంశంపై చర్చ..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడం, ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమవుతుండడంతో దీనిపై కూడా విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. కేంద్రంపై ఎలా పోరాడాలి అనే అంశంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అని తెలుస్తోంది.