'తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న రేవంత్‌'.. సీఎం చంద్రబాబు ప్రశంస

రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లతో సమానమని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

By అంజి  Published on  7 July 2024 2:15 PM IST
AP CM Chandrababu, CM Revanth Reddy, Telangana, Hyderabad

తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న రేవంత్‌'.. సీఎం చంద్రబాబు ప్రశంస

రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లతో సమానమని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం వస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్లలేదని, నాయకులు వెళ్లారు కానీ, కార్యకర్తలు పార్టీనే నమ్ముకుని ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలంగాణను సీఎం రేవంత్‌ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. అందుకే స్వయంగా కలిసి అభినందించినట్టు తెలిపారు. ఏపీ, తెలంగాణ అన్నదమ్ముల్లా కొనసాగుతాయని, గొడవలు పడితే సమస్యలు తీరవని అన్నారు. అందుకే కూర్చుని విభజన సమస్యలపై చర్చించామని చెప్పారు. తాను ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్ట్‌, ఐటీ రంగాలను డెవలప్‌ చేశానని, టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే టీడీపీ ధ్యేయం అని చంద్రబాబు పేర్కొన్నారు.

నాలెడ్జ్‌ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్‌ను తయారు చేసిన ఘనత టీడీపీదని చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీని టీడీపీ ప్రారంభించిందని, ఆ తర్వాత వచ్చిన అన్ని పార్టీలు దాన్ని కొనసాగించాయి తప్ప చెడగొట్టలేదన్నారు. అందుకు తాను అభినందిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పదేళ్ల చొప్పున తెలంగాణను పాలించాయని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ వచ్చిందని, సీఎం రేవంత్‌ రెడ్డి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

Next Story