ఈ-కార్ రేసు..ఆ అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు
ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
By - Knakam Karthik |
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కేసులో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. మరో వైపు ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ఇద్దరు అధికారులపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేసింది. కాగా ప్రభుత్వం నుంచి ఏసీబీకి విజిలెన్స్ కమిషన్ నివేదిక చేరింది. అయితే మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక రాజ్‌భవన్ కార్యాలయంలో ఉండటంతో..ఈ ఫార్ములా ఈ కార్ రేసుపై గవర్నర్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కాగా ఫార్ములా ఈ-రేసు కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు ప్రమోటర్లు ఏ4, ఏ5 నిందితులుగా ఉన్నారు.
హెచ్‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54 కోట్ల 88 లక్షలను మంత్రివర్గం అనుమతి లేకుండానే..ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ…ఫెమా నిబంధనలను పాటించకుండా ఫార్ములా ఈ కారు రేసు సంస్థలకు నిధులు బదలాయించారని ఏసీబీ అభియోగాలు మోపింది. అప్పటికే కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం రూ.54.88 కోట్లకే ఆగిపోయిందని, లేదంటే రూ.600 కోట్ల స్కామ్జరిగి ఉండేదని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే ఈ వ్యవహారంలో క్విడ్ ఫ్రోకో రూపంలో ఈ కారు రేసు సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళం అందిందని ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఫార్ములా ఈ-కారు రేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్, బీఎల్ఎన్ రెడ్డిను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది.