చిన్న పిల్లలకు ఎప్పుడు ఒంట్లో బాగుండదో తెలియని పరిస్థితి. అందుకే వీలైనంత త్వరగా చిన్న పిల్లలను డాక్టర్ల దగ్గరకు తీసుకొని వెళుతూ ఉంటారు తల్లిదండ్రులు. చిన్నారులు ఏడుస్తూ ఉంటే ఎంతో బాధ కూడా ఉంటుంది. అయితే రెండు నెలల చిన్నారిని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లకుండా.. భూత వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. అయితే ఆ భూత వైద్యుడు ఇంకా ఘోరంగా ప్రవర్తించాడు. పిల్లాడి కడుపు చుట్టూ కొరికి తగ్గిపోతుంది వెళ్ళమని అన్నాడు. అతడు చెప్పిందే నిజమవుతుందని నమ్మిన తల్లిదండ్రులు.. ఇప్పుడు కడుపుకోత అనుభవిస్తూ ఉన్నారు.

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కరకగూడెం మండలం అశ్వాపురపాడు వలస ఆదివాసీ గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. సోమవారం రాత్రి నుంచి చిన్నారి కడుపునొప్పితో బాధపడుతుండగా వైద్యుని వద్దకు వెళ్లకుండా అదే గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లారు. అతడు బాబు బొడ్డు చుట్టూ కొరకడంతో పాటు పసరు మందు వేశాడు. మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లిన ఆశ కార్యకర్త అనారోగ్యంగా ఉన్న బాబుని గుర్తించి వెంటనే తల్లిదండ్రులతో కలసి కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. ఈ కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాలతో ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు.


సామ్రాట్

Next Story