కేసీఆర్ జైలుకే : అమిత్ షా

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమయ్యారు.

By Medi Samrat  Published on  24 Nov 2023 10:04 AM GMT
కేసీఆర్ జైలుకే : అమిత్ షా

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని అన్నారు. పదేళ్లలో తెలంగాణను విధ్వంసం చేశారని.. ఆర్టీసీ స్థలాలను కూడా బీఆర్ఎస్ నేతలు వదలడం లేదని అన్నారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే.. కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్న ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. కేసీఆర్ సర్కార్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ముస్లీం మైనార్టీలకు ఇచ్చే 4 శాతం రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాలకు ఇస్తామని మాట ఇచ్చారు.

25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌ షోలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగించనున్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.

Next Story