విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ సమయంలో పక్షి ఇంజిన్‌లో ఇరుక్కుపోవడంతో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX 2658 పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించడంతో హైదరాబాద్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని విశాఖపట్నం చేరుకున్నట్లు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజా రెడ్డి తెలిపారు.
విశాఖపట్నం నుండి టేకాఫ్ అయిన తర్వాత పైలట్ ఇంజిన్‌లో కొంత సమస్యను నివేదించినట్లు రెడ్డి పిటిఐకి తెలిపారు. అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ని అభ్యర్థించి.. విశాఖపట్నం తిరిగి వచ్చాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యి ప్రయాణికులను దింపారు. విమానయాన సంస్థ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.
విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.38 గంటలకు బయలుదేరిన విమానం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చింది. విమానం కేవలం 10 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ప్రయాణించింది. అయితే టేకాఫ్ సమయంలో పక్షి ఇంజిన్‌లో ఇరుక్కుపోయినట్లు అనుమానిస్తున్నారు.