తెలంగాణలో సంచలనం రేపిన న్యాయవాద దంపతుల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ జరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత నెల 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద జరిగిన న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇద్దరి వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదుచేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నెల 4న వామన్‌రావు తండ్రి వాంగ్మూలం నమోదు చేస్తామని చెప్పారు.
మిగతా సాక్షుల వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించగా.. వాంగ్మూలాల నమోదుకు ఇవాళే మేజిస్ట్రేట్‌ను కోరతామని పోలీసులు వివరించారు. నలుగురు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. సీసీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లు స్వాధీనం చేసుకున్నారా?.. బస్సుల్లోని ప్రయాణికులందరిని గుర్తించారా అన్న ప్రశ్నకు.. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని ఏజీ బదులిచ్చారు.
వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు అడగ్గా.. తదుపరి నివేదికలో వివరాలు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 15కి వాయిదా వేసింది.