ఆ భూములపై ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయండి, ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik
ఆ భూములపై ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయండి, ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున ఈ నెల 24లోపు కౌంటర్, రిపోర్టు సమర్పించాలని ఆదేశించిది. కాగా ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి అంటూ వట ఫౌండేషన్, వర్సిటీ విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇద్దరి పిటిషన్లపై గత విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం భూముల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా సంబంధిత పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని రకాల చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉదయం విచారణ సమయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు.