బీజేపీకి మరో షాక్.. విజయశాంతి రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. విజయశాంతి నవంబర్ 15, బుధవారం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 16 Nov 2023 1:51 AM GMTబీజేపీకి మరో షాక్.. విజయశాంతి రాజీనామా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. రాజకీయ నాయకురాలిగా మారిన నటి విజయశాంతి నవంబర్ 15, బుధవారం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆమె అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం దక్కడం లేదనే అభిప్రాయంలో విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తన రాజీనామాను రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపారు. విజయశాంతి డిసెంబర్ 1997లో బిజెపిలో చేరారు. ఆ తర్వాత బిజెపి మహిళా విభాగం (భారతీయ మహిళా మోర్చా) కార్యదర్శిగా చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ఆమె తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2009-2014 మధ్య మెదక్ నియోజకవర్గం నుండి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత, ఆమె టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్‌తో విభేదించి 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మెదక్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆరు నెలల క్రితం విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆమె దానిని ఖండించింది. ఈ వార్తలను పుకార్లు అని పేర్కొంది. విజయశాంతి చాలా కాలంగా బిజెపి పార్టీ నుండి వైదొలగాలని యోచిస్తున్నారని, అయితే కొంతమంది బిజెపి అగ్రనేతలు ఆపడంతో ఆమె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని వర్గాలు తెలిపాయి.