రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో స్థానికులు ఇంట్లో నుండి బయటకు పరుగులు తీసి వెంటనే సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో పడ్డారు. నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.
కంపెనీ యజమాన్యం నిబంధనలకు విరుద్దంగా పరిశ్రమ నడుపుతోందని సమచారం. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కంపెనీలో ఎవరూ లేరని, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు గంటలు శ్రమించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణం నష్టం జరగలేదు.. కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా కంపెనీ యాజమాన్యం తెలిపింది.