Hyderabad: చంద్రబాబు ర్యాలీపై కేసు నమోదు

చంద్రబాబు ర్యాలీపై హైదరాబాదులో కేసు నమోదు అయింది. తెలంగాణలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on  2 Nov 2023 7:30 AM GMT
TDP, Chandrababu, Hyderabad, Telangana

Hyderabad: చంద్రబాబు ర్యాలీపై కేసు నమోదు

చంద్రబాబు ర్యాలీపై హైదరాబాదులో కేసు నమోదు అయింది. నిన్న చంద్రబాబు నాయుడు బేగంపేట్ విమానాశ్రయంలో దిగిన అనంతరం అక్కడి నుండి ఆయన నివాసం జూబ్లీహిల్స్ వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా చంద్రబాబుపై బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుండి బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్ సిటీ టిడిపి పార్టీ జనరల్ సెక్రెటరీ జివిజి నాయుడు, మరికొంత మంది కలిసి ముందస్తు అనుమతి లేకుండా బేగంపేట విమానాశ్రయంలో గుమి గూడారు. చంద్రబాబు బేగంపేట విమానాశ్రయం నుండి తన నివాసానికి బయలుదేరారు. ఇంతలో వీరందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 50 బైకులు, 20 కార్లుతో పాటు 400 మంది సభ్యులు పాల్గొన్నారు.

బేగంపేట విమానాశ్రయం నుండి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. దీంతో రోడ్లపై భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బేగంపేట నుండి పంజాగుట్ట వరకు దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ జయశంకర్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాలీకి అనుమతి లేకుండా నిర్వహించినందుకు.. నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని వీరి వల్ల వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని సబ్ ఇన్స్పెక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు ఐపిసి సెక్షన్ 341 290r/w341....21r/w76సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిన కారణంగా చంద్రబాబు నాయుడు ర్యాలీపై టిడిపి పార్టీ జనరల్ సెక్రెటరీ జివిజి నాయుడుతో సహా పలువురి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story