ఆ వాట్సాప్ ఐడీలను ప్రభుత్వం బ్లాక్ చేసింది : బండి సంజయ్
ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్టుకు సంబంధించిన క్రైమ్ అధికంగా నడుస్తూ ఉంది.
By Medi Samrat
ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్టుకు సంబంధించిన క్రైమ్ అధికంగా నడుస్తూ ఉంది. అయితే ఈ డిజిటల్ అరెస్ట్ కేసులతో ముడిపడి ఉన్న 83,668 వాట్సాప్ ఖాతాల, 3,962 స్కైప్ ఐడీలను ప్రభుత్వం బ్లాక్ చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభకు తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత మహేష్ కశ్యప్ లేవనెత్తిన ప్రశ్నలకు బండి సంజయ్ లిఖితపూర్వకంగా ఈ సమాచారాన్ని అందించారు. సైబర్ మోసాలను అరికట్టే ప్రయత్నాలలో భాగంగా అధికారులు దాదాపు 781,000 సిమ్ కార్డులు, 208,469 IMEI లను గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
డిజిటల్ అరెస్టులకు సంబంధించిన నేరాలను నివారించడానికి తీసుకున్న చర్యల గురించి అడిగినప్పుడు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ను ఏర్పాటు చేసిందని, ఇది సైబర్ నేరాలను సమన్వయంతో ఎదుర్కోవడానికి కేంద్రీకృత సంస్థగా పనిచేస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఇటువంటి నేరాల గురించి తెలియజేయడానికి, ప్రజలకు అవగాహన పెంచడానికి కేంద్రం విస్తృతమైన డిజిటల్ ప్రచారాలను ప్రారంభించిందని ఆయన అన్నారు. ఇందులో బహుళ ప్రాంతీయ భాషలలో కాలర్ ట్యూన్ హెచ్చరికలు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజా అవగాహన కార్యక్రమాలు ఉన్నాయన్నారు. బాధితులకు సంఘటనలను నివేదించడంలోనూ, నష్టాలను నివారించడంలో సహాయం చేయడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్, 1930 అమలులో ఉందని తెలిపారు.