లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో మరో 8 మంది

లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు.

By Medi Samrat  Published on  16 Nov 2024 2:16 PM IST
లగచర్ల ఘటన.. పోలీసుల అదుపులో మరో 8 మంది

లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 17 మందితో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మందిని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించామని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అరెస్టుల భయంతో చాలా మంది గ్రామస్తులు లగచెర్ల నుంచి వెళ్లి ఇతర గ్రామాల్లో త‌ల‌దాచుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో 16 మందిని పరిగి జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.

ఈ ఘటనపై అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్ విచారణ ప్రారంభించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసులతో ఆయన సమావేశమయ్యారు, ఎస్పీ నారాయణరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో అదనపు డీజీ సమావేశమై ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం.

Next Story