వచ్చే వారమే 70,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2023 9:00 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి మొదటి దశ వారంలో ప్రారంభమవుతుంది. ఆసియాలోనే అతిపెద్ద 2BHK డిగ్నిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధి కర్మాగారం, తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్‌లో భద్రత కోసం CCTV కెమెరాలు, అంతస్తుకు రెండు లిఫ్ట్‌లు, వాణిజ్య దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. GHMC పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగకుండా పంపిణీ జరగాలన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 70వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులకు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు వివరించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష 2 బీహెచ్‌కే ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో సాగుతున్నామని.. ఇప్పటికే 75 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించామని, వీటిలో ఇప్పటికే దాదాపు 4,500 ఇళ్లను ఇన్ సైటు లబ్ధిదారులకు అందజేశామన్నారు. దాదాపు 70 వేల ఇళ్లు పేదలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐదు నుంచి ఆరు దశల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారులు రాజకీయ ప్రమేయం లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. గృహ లక్ష్మి పథకం లబ్ధిదారుల గుర్తింపు, పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపై మంత్రి చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తున్నదని మంత్రులు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని కోరారు.