మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో మొత్తం 47 మంది అభ్య‌ర్థులు

47 Members Candidates contest in Munugode By Poll.మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో మొత్తం 47 మంది అభ్య‌ర్థులు నిలిచారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Oct 2022 8:16 AM IST
మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో మొత్తం 47 మంది అభ్య‌ర్థులు

మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో మొత్తం 47 మంది అభ్య‌ర్థులు నిలిచారు. సోమ‌వారంతో నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ గ‌డువు ముగిసింది. 130 మంది అభ్య‌ర్థులు 190 సెట్ల నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా.. వీటిలో 47 మంది నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురైయ్యాయి. మిగిలిన 83 మందిలో 36 మంది నామినేష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. మొత్తంగా 47 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న‌ట్లు ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్య‌ర్థుల పేర్ల‌కే అవ‌కాశం ఉంది. 47 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉండ‌డంతో ప్ర‌తి బూత్‌లో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, న‌ల్ల‌గొండ క‌లెక్ట‌ర్ విన‌య్‌కృష్ణారెడ్డి తెలిపారు. అభ్య‌ర్థుల పేరు, గుర్తుతో పాటు వారి ఫోటోలు కూడా ఈవీఎంల‌లో ఉంటాయ‌న‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో మునుగోడులో 15 మంది పోటీ చేయ‌గా.. ఈ సారి అభ్య‌ర్థుల సంఖ్య మూడింత‌లు పెరిగింది. స్వతంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించిన గుర్తుల కార‌ణంగా ఓట్లు చీలిపోయే అవ‌కాశం ఉండ‌డంతో ప్ర‌ధాన పార్టీ అభ్య‌ర్థుల్లో ఒకింత టెన్ష‌న్ నెల‌కొంది. ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

Next Story