పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత‌.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న 20 మంది కూలీలు

భారీ వర్షాల కార‌ణంగా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మండలంలోని నారాయ‌ణ‌పురం లోలెవల్‌ వంతెనపై 19 మంది కూలీలు చిక్కుకుపోయారు

By Medi Samrat  Published on  18 July 2024 8:30 PM IST
పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత‌.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న 20 మంది కూలీలు

భారీ వర్షాల కార‌ణంగా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మండలంలోని నారాయ‌ణ‌పురం లోలెవల్‌ వంతెనపై 19 మంది కూలీలు చిక్కుకుపోయారు. నారాయణపురం వద్ద కట్ట మైసమ్మ దేవాలయం వద్ద పెద్దవాగు వరద ఉధృతి పెరగడంతో వ‌ర‌ద పీటిలో చిక్కుకుపోయిన‌ 19 మందిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

మండలంలోని బచ్చువారిగూడెం వద్ద కూడా వరద నీటిలో నలుగురు గొర్రెల కాపరులు చిక్కుకుని వాగు పక్కనే ఉన్న చెట్టుపై ఆశ్రయం పొందారు. నారాయణపురం వద్ద ఉన్న వారు లోలెవల్ వంతెనపై వరద నీటిలో నిలబడి ఉన్నారు. మండలంలోని పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో వారు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయారు. స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌కు సమాచారం అందించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story