హైదరాబాద్: అంగన్‌వాడీల్లో 14 వేల పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ఏజెన్సీలో ఎస్టీలకు 100 శాతం కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు.
ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్క సమావేశం నిర్వహించి, న్యాయ చిక్కులపై సలహాలు స్వీకరించారు. ఈ సమావేశంలో లా సెక్రటరీ బీ. పాపిరెడ్డి, పీఆర్సీ చైర్మన్ ఎన్. శివ శంకర్, శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా పాల్గొన్నారు. గతంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్, హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో రిజర్వేషన్లు 50 శాతం మించి పోయాయి. దీంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా సుప్రీం కోర్టు స్టే విధించింది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50 శాతం రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా కూడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేసి, స్టేను తొలగించుకునే చర్యలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. 10 రోజుల్లోగా నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలన్నారు. కొత్త నియామకాలు అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.