'విజయశాంతి' కమలానికి క్లాప్ కొడతారా…?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 7:16 AM GMT
విజయశాంతి కమలానికి క్లాప్ కొడతారా…?

ముఖ్యాంశాలు

  • కాంగ్రెస్‌లో అశాంతితో ర‌గిలిపోతున్న రాముల‌మ్మ‌!
  • కాషాయ ద‌ళంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు!
  • సొంత గూటికి ర‌ప్పించేందుకు క‌మ‌ల‌నాథుల ప్ర‌య‌త్నాలు

తెలంగాణ రాములమ్మ ఎవరంటే అంద‌రు ట‌క్కున చెప్పే పేరు విజయశాంతి. కాంగ్రెస్ నుంచి మరో పార్టీలోకి వెళ్లేందుకు కూడా క్లాప్ కొట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వెడెక్కిస్తోంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ లేడి డాన్ గా వ్యవహరించి అందరి మన్నన‌లు పొందిన రాజకీయా నాయకురాలు విజయశాంతి అని బల్లగుద్దినట్లు చెప్పుకోవాలి.

రాముల‌మ్మ కాంగ్రెస్‌లో అంశాంతితో ర‌గిలిపోతుందా...?

కాంగ్రెస్ లో అశాంతితో రగిలిపోతున్న విజయశాంతి, కాషాయతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతోన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నాయి. కాంగ్రెస్ లో మహిళలకు విలువలు లేవనే నిరాశతో కమలం గూటికి వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏకంగా ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానాలు కూడా వచ్చినట్లు సమాచారం. బీజేపీలోకి వెళ్లేది లేదని గతంలోనే శపథం చేసిన రాములమ్మ, ఒట్టు తీసి గట్టున పెట్టి, పువ్వు పరిమళాన్ని ఆస్వాదించేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని నేతలు అంటున్న మాట. ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి, రాజకీయాలకు సమయం తగ్గించారు. కాని టీ కాంగ్రెస్ నేతలు తనను పట్టించుకోకపోవడం వల్లే, తాను పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నట్లు సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్లు తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని కూడా రాములమ్మ వాపోతున్నారట.

అయితే, హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాములమ్మను, కాషాయ కండువా కప్పి, సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో మెజార్టీ సీనియర్లంతా బీజేపీ వైపు చూస్తుండటంతో, సినిమా గ్లామర్ తో పాటు రాజకీయ ఇమేజ్ ఉన్న రాములమ్మను స్వగృహ ప్రవేశం చేయించాలని బీజేపిలో అగ్రనాయకత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్లంతా తనను టార్గెట్ చేస్తూ పార్టీలో పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో, రాములమ్మ సైతం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి వల్లే, తమిళనాడులో శశికల ఇబ్బందుల్లో పడిందనే ప్రచారం ఉండటంతో, ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండే విజయశాంతి, గతంలోనే శశికళపై సానుభూతి చూపారు. ఈ నేపథ్యంలో, తన స్నేహితురాలిని కటకటాల పాలు చేసిన బీజేపి గూటికి విజయశాంతి చేరతారో లేదోనన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే, గతంలో చిన్నమ్మను ఇబ్బంది పెట్టిన కాషాయ దళంలోకి వెళ్లేది లేదంటూ బహిరంగంగా ప్రకటన చేశారు విజయశాంతి. దీంతో ఆమె కాషాయ దారిలో వెళ్తారా ..? లేదా అన్నది చెప్పలేమంటున్నారు విజయశాంతి సన్నిహితులు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను రాములమ్మ నిజం చేస్తారన్న మాట కూడా బలంగానే వినిపిస్తోంది. తెలంగాణలో కమలం వికసించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఆమె అటువైపు వెళ్లే అవకాశాలున్నాయనే మాట కూడా రాజకీయ నాయకుల చెవిలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతో రాములమ్మ కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీలోకి వెళ్లేందుకు దారులు తెరుచుకునే ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మొత్తం మీద మరి విజయశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

Next Story