నేటి నుండే 'సేవ్‌ ఆర్టీసీ'..!

By అంజి  Published on  25 Nov 2019 5:56 AM GMT
నేటి నుండే సేవ్‌ ఆర్టీసీ..!

ముఖ్యాంశాలు

  • 52వ రోజుకు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • 'సేవ్‌ ఆర్టీసీ' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు
  • ఆర్టీసీ సమ్మెపై ఇప్పటి వరకూ స్పందించని ప్రభుత్వం
  • బస్సు సౌకర్యాలు లేక ప్రయాణికుల అష్టకష్టాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. సమ్మె భవిష్యత్తు కార్యచరణలో భాగంగా 'సేవ్‌ ఆర్టీసీ' పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని బస్‌ డిపోల ముందు కార్మికులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. జిల్లాల్లోని జంక్షన్లు, బస్టాండ్‌లలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. సేవ్‌ ఆర్టీసీ, ఆర్టీసీని కాపాడంటూ కార్మికులు నినాదాలు చేశారు. అటూ కరీంనగర్‌లో బస్టాండ్‌ నుంచి జయశంకర్‌ విగ్రహాం వరకు కార్మికులు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన కార్మికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్టాండ్‌ కార్మికులు మానవహారం, ధర్నా చేపట్టారు. హయత్‌నగర్‌ డిపో ముందు బైఠాయించి కార్మికులు ధర్నా చేశారు. ఉద్యోగం చేయడానికి వస్తే.. మమ్మల్ని అధికారులు ఉద్యోగాలకు తీసుకోవడంలేదంటూ ఆందోళన చేశారు. హయత్‌నగర్‌ డిపో ముందు కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు నివాళులు అర్పించారు.

కార్మికులకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ధన్యావాదాలు తెలిపారు. జేఏసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. అన్ని డిపోల ముందు మానవహారాలు విజయవంతం అయ్యాయని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. కార్మికులు డిపోలు, బస్టాండ్‌ల వద్ద, ప్రధాన కూడళ్లలో ‘సేవ్‌ ఆర్టీసీ’పేరుతో నిరసనలు తెలియజేయాలన్నారు. 47 రోజుల నిరసనల తర్వాత సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ.. కార్మికులను బేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరింది. కాగా హైకోర్టు నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని కార్మికులు భావించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ తమ సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగంలో చేరతామన్న.. ప్రభుత్వం రెస్పాన్స్‌ కాకపోవడంతో.. కార్మికులు యథావిధిగా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. అన్ని డిపోల ముందు కార్మికులు మానవహారాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల పట్లు సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని కార్మిక నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కార్మికులు భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సమ్మెను విరమిస్తామని కార్మికులు చెప్పినా.. విధుల్లోకి తీసుకోకపోవడాన్ని కార్మిక నేతలు తీవ్రంగా దుయబట్టారు. వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు కొనసాగించాలని కార్మికులకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన రవాణ సదుపాయాలు లేక కాలేజీ విద్యార్థులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రయాణికులకు అద్దె బస్సులు చుక్కలు చూపిస్తున్నాయి. అరకొరగా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. కొన్ని బస్సులు మార్గం మధ్యలోనే మొరాయిస్తున్నాయి. బస్సు సౌకర్యాలు లేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.

Next Story