ఈ సారి ఆ రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. ఇప్పుడు పదో వసంతంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.
By అంజి Published on 30 May 2023 12:00 PM IST
ఈ సారి ఆ రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. ఇప్పుడు పదో వసంతంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ఈ నేథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంకల్పించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా కేంద్ర ప్రభుత్వం కూడా అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. జూన్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి దీటుగా గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, పారా మిలటరీ దళాలు కవాతు చేయనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు హోంమంత్రి అమిత్ షాతోపాటు పలువురు జాతీయ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లో కూడా జరగనున్నాయి. మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో కూడా ఈ సారి అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సం నిర్వహించనున్నారు. ఈ విషయమై అక్కడి అధికారులు అధికారిక ప్రకటన కూడా చేశారు. మధ్యప్రదేశ్‌లో రాజ్ భవన్‌లో జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు తనకు ఆహ్వానం అందిందని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి.నరహరి తన ట్విటర్ లో తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొననుండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్ మంగుభాయి పటేల్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరుకానున్నారు. అటు అస్సాం ప్రభుత్వం కూడా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. రాజ్ భవన్ లో నిర్వహించే వేడుకలకు హాజరుకావాలని అస్సాం తెలుగు సంఘానికి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు.
జయహో #తెలంగాణ ! మొదటిసారి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అధికారికంగా “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు”. 🇮🇳ఈ కార్యక్రమం మహాకాల్ ఉజ్జైన్ నగరంలో జూన్ 2న మధ్య ప్రదేశ్ గౌరవ @GovernorMP మాన్యులు శ్రీ మంగుభాయి పటేల్ గారి అధ్యక్షతన జరుగును. #Telangana pic.twitter.com/otXGFebnqt
— P Narahari IAS (@pnarahari) May 28, 2023