తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. హైదరాబాద్‌ను వీడని కరోనా..ఈ రోజు ఎన్ని అంటే..
By సుభాష్ Published on 10 May 2020 8:21 PM ISTతెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ విజృంభిస్తోంది. అది కూడా ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఆదివారం తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 33 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30 మంది మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 751 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 415 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 27 హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటం గమనార్హం.
అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగడంతో మంచిఫలితాలనే ఇస్తోంది. గడిచిన 14 రోజుల్లో రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో కూడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక తెలంగాణలో కేసుల సంఖ్ తగ్గుముఖం పట్టి.. మళ్లీ పెరుగుతున్నా.. దేశ వ్యాప్తంగా మరింత విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాస్తా ముందుకెళ్లింది. మే 29 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రీన్ జోన్‌లో ఉన్న ఈ జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలో మూడు పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.
వీరంతా కూడా ఈ మధ్యకాలంలో ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చినట్లు గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.