తెలంగాణ కరోనా కేసుల్లో అత్యధికం అలాంటివేనట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 9:10 AM GMT
తెలంగాణ కరోనా కేసుల్లో అత్యధికం అలాంటివేనట

కరోనా మహమ్మారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులకు సంబంధించి కొత్త అంశాన్ని గుర్తించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ విశ్లేషించింది. తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడటం. మొత్తం కేసుల్లో ఈ తరహాలో 69 శాతం ఉన్నట్లు తేలింది. కేవలం 31 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడినట్లుగా తేల్చారు.

ఇప్పటివరకు తెలంగాణలో 1.24లక్షల మందికి పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 86వేలకు మందికి ఎలాంటి లక్షణాలు లేవని తేలింది. కేవలం 38వేల మందికి మాత్రమే రోగ లక్షణాలు కనిపించినట్లుగా చెబుతున్నారు. రోగ లక్షణాలు లేకుండా పాజిటివ్ అయ్యేవారితో వచ్చే ఇబ్బందేమంటే.. ఇలాంటి వారితోనే పెద్ద ఎత్తున ఇతరులకు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. దీనికి నిదర్శనంగా అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మంది వరకు కరోనా సోకినట్లుగా చెబుతున్నారు.

మరో కీలక అంశం ఏమంటే..తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో సీరియస్ కేసులు తక్కువగా నమోదు కావటం. వైరస్ సోకిన వారికి వెంటనే వైద్యం చేయటంతో పాటు ప్రాథమిక.. సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి వైద్యం చేయటంతో వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24,216 మంది ఇళ్ల వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయి. మొన్నటివరకు రోగులతో నిండి ఉన్న దానికి బదులుగా.. ఇప్పుడురద్దీ తక్కువగా ఉంటోంది. మొదట్లో నిర్లక్ష్యం.. రోగ తీవ్రత మీద అవగాహన తక్కువగా ఉండటంతో చాలామంది వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మారినట్లు చెబుతున్నారు.

ప్రజల్లో పెరిగిన అవగాహనతో వైరస్ లక్షణాలు కనిపించినంతనే స్పందిస్తున్నారు. వైద్యం షురూచేస్తున్నారు. దీంతో.. వైరస్ తీవ్రత ముదరకుండా చెక్ పెట్టుకోవటం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.ఇరుగుపొరుగన ఉన్న మహారాష్ట్ర.. తమిళనాడు.. ఆంద్రప్రదేశ్ లతో పోలిస్తే.. తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువగా ఉందని చెప్పక తప్పదు.

Next Story