శాంపిళ్ల సేకరణ ఆపటం వెనుక అసలు కారణం అదేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 5:44 AM GMT
శాంపిళ్ల సేకరణ ఆపటం వెనుక అసలు కారణం అదేనా?

మరో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సాధించాలని ఫిక్స్ అయ్యారు. అలాంటప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? పెట్టుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తగినన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది చెక్ చేసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తే.. అలాంటి పక్కా ప్లానింగ్ ఏదీ ఉన్నట్లు కనిపించట్లేదు.

వారం నుంచి పది రోజుల్లో యాభై వేల మహమ్మారి టెస్టులు చేసేందుకు వీలుగా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంపిళ్ల కలెక్షన్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శాంపిళ్ల సేకరణ ఎలా చేపట్టాలి? ఎవరికి చేయాలి? అన్న దానిపై స్పష్టత చాలా అవసరం. కానీ.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ కారణంతోనే శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే దగ్గర దగ్గర 8200 శాంపిళ్లను పరీక్షించాల్సి ఉందని.. వాటి ఫలితాలు తేల్చటానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే కొత్త శాంపిళ్లను తీసుకునే కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. అయితే.. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేనప్పటికీ.. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పవని చెబుతున్నారు.

ఎందుకంటే.. కేసులు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. కొత్తగా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. వారి కుటుంబ సభ్యులు.. ప్రైమరీ కాంటాక్టులే బోలెడంతమంది ఉంటారు. అలాంటి వారంతా టెస్టులు చేసుకోవాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. తర్వాత శాంపిళ్లు ఇచ్చినా.. వాటి ఫలితాలు రావటానికి మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకూ ఫలితం ఏమై ఉంటుందన్న సందేహంతో ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగం కంటే కూడా రోగం ఉందన్న అనుమానంతో బతుకు బండి లాగటం కష్టంగా మారుతుంది. ఇలాంటివారిలో భయం తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు నాలుగువేళ శాంపిళ్లను లెక్క తేల్చే సామర్థ్యం ఉందా? అన్న విషయాన్ని ముందే చెక్ చేసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది.

ఇప్పుడైతే సరే.. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉంది. అలాంటివేళలోనూ.. ఇప్పటిమాదిరే టెస్టులు నిర్వహించటానికి భారీ ఎత్తున శాంపిళ్లు పేరుకు పోయాయని చెప్పి.. నిర్దారణ పరీక్షలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేస్తే.. ఆందోళనలు మరింతగా పెరిగిపోవటం ఖాయం. ఈ విషయాన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని చెప్పాలి. మరీ.. పాఠం నుంచి కేసీఆర్ ఏం నేర్చుకుంటారో చూడాలి.

Next Story