హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌కు కరోనా..!

By సుభాష్  Published on  20 March 2020 4:49 PM IST
హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌కు కరోనా..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోకి వ్యాపించింది. ఈరోజు కూడా రెండు కేసులు నమోదు కాగా, తాజాగా కరోనా కేసుల సంఖ్య 18కి చేరుకుంది. ఇక ఈ వైరస్‌ క్యాబ్‌లపై పడింది. శంషాబాద్‌ దగ్గర క్యాబ్‌ డ్రైవర్లలో ఒకరికి కరోనా ఉన్నట్లు అనుమానాలొస్తున్నాయి. దీంతో అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌కు కరోనా అనుమానాలుండటంతో జనాలు క్యాబ్‌లు ఎక్కేందుకు జంకుతున్నారు.

గత రెండు రోజులుగా ప్రయాణికులు లేక వినామాశ్రయ పరిసర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. కాగా, విదేశాల్లో ఉన్నవారితో తమకు కరోనా సోకే ప్రమాదం ఉందని క్యాబ్‌ డ్రైవర్లు భయాందోళన చెందుతున్నారు. మొత్తం మీద క్యాబ్‌ డ్రైవర్లు భయాందోళనల మధ్య రోడ్డెక్కుతున్నారు.

కాగా, భారత్‌లో ఇప్పటి వరకు 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే భారత సర్కార్‌ విదేశాల నుంచి విమానాల్లో వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. వారిని భారత్‌కు రానివ్వకుండా చర్యలు చేపడుతోంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాల సంఖ్య 10వేలకు చేరుకుంది. 2 లక్షలకుపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల్లో ముందుగా చైనా ఉండగా, రెండోస్థానంలో ఇటలీ ఉండేది. తాజాగా చైనాకన్న ఇటలీ మొదటి స్థానంలో ఉంది. అత్యధికంగా ఇటలీలో కరోనా మరణాలు సంభవిస్తున్నారు.

Next Story