తెలంగాణలో 18కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

By Newsmeter.Network  Published on  20 March 2020 10:28 AM GMT
తెలంగాణలో 18కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు గడగడలాడిపోతున్నాయి. పలు దేశాల్లో రోజుకు వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 10,050 మంది మృత్యువాత పడగా.. 2,45,652 మంది కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ ఈ వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈనెల 31 వరకు ఎవరూ బయటకు రావద్దని, 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్‌ సోకిన వారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏపీలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18కి చేరింది. ఈమేరకు తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం మధ్యాహ్నం ధ్రువీకరించింది. దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ భారిన పడిన ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారేనని అధికారులు పేర్కొంటున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన వీరిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో్ స్క్నీనింగ్‌ నిర్వహించగా.. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారిని నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు.

నమూనాలను పరీక్షలకు పంపించగా.. శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బాధితులిద్దరూ లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారే. ఇదిలాఉంటే కరోనా గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఏఒక్కరికి సీరియస్‌గా లేదని, బాధితులందరూ కోలుకుంటున్నారని ఆయన తెలిపారు.

Next Story