అభ్యర్థులున్నారు.. బలపరిచేవారే లేరు

By సుభాష్  Published on  14 Feb 2020 5:56 AM GMT
అభ్యర్థులున్నారు.. బలపరిచేవారే లేరు

తెలంగాణ రాష్ట్ర సహకార ఎన్నికల్లో ఈ సారి మున్నెన్నడూ లేని ఓ విచిత్రం చోటుచేసుకుంది. పంచాయతీ, నగర పాలక సంస్థల ఎన్నికల ఘన విజయం తరువాత టీఆర్ ఎస్ కి ఈ సారి నల్లేరు మీద నడకే. అసలు కాంగ్రెస్, బిజెపిలు పోటీ విషయంలో పెద్ద పట్టుదలేమీ చూపించడం లేదు. కాబట్టి అధికార టీఆర్ ఎస్ కు ఒక రకంగా చెప్పాలంటే వెన్నలోకి కత్తి దించినంత సులభంగా గెలుపు దక్కుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 905 సహకార సంఘాల్లో 46 శాతానికి పైగా స్థానాలు టీఆర్ ఎస్ సభ్యులకు ఏకగ్రీవం అయిపోయాయి. ఇప్పటికే 156 సహకార సంఘాల చైర్మన్ల ఎన్నిక కూడా అనధికారికంగా జరిగిపోయిందని తెలుస్తోంది.

అయితే విచిత్రం ఏమిటంటే మొత్తం 905 సహకార సంఘాల్లో 700 కి పైగా సంఘాలలో మొత్తం ఓటర్ల సంఖ్య వందకు లోపునే ఉంది. కారణం ఏమిటంటే సహకార సంఘ సభ్యులు ఋణాలు తీసుకుని చెల్లించకపోతే వారు ఓటు వేయడానిక అనర్హులౌతారు. చాలా సంఘాల్లో 70 నుంచి 90 శాతం వరకూ సభ్యులు ఋణాలు చెల్లించలేదు. వారు డీఫాల్టర్లు అవుతారు. వారు ఓటు వేయలేరు. దీంతో పలు సంఘాల్లో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని సహకార సంఘాల్లో పోటీ చేయదలచిన వారి అభ్యర్థిత్వాన్ని బలపరచేవారు కూడా కరువయ్యారు. దీంతో కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా పోటీ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సారి మొత్తం పోలింగ్ రెండు గంటలకు మించి జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని చోట్ల అరగంటలోనే ఓటింగ్ పూర్తయిపోయి, పోలింగ్ సిబ్బంది చాప చుట్టేయవచ్చు కూడా. మామూలుగా ఒక్కో సహకార సంఘంలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది సభ్యులుంటారు. కానీ ఋణాల ఎగవేత కారణంగా వీరిలో బహుసంఖ్యాకులకు వోటు హక్కు ఉండదు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11765 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11654 డైరక్టర్ పదవులుండగా వాటిలో ఇప్పటికే 5387 స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఓటింగ్ 6267 డైరెక్టర్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ పిబ్రవరి 15 న జరుగుతుంది. మొత్తం 14529 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Next Story