కేటీఆర్, నిర్మలా సీతారామన్ ట్వీట్ల యుద్ధం

By రాణి  Published on  14 Feb 2020 6:03 AM GMT
కేటీఆర్, నిర్మలా సీతారామన్ ట్వీట్ల యుద్ధం

కేటీఆర్ ఈ మధ్య ట్విట్టర్ రణరంగంలో పదేపదే కత్తులు దూస్తున్నారు. ఒకో సారి ఫ్రెండ్లీ ఫైట్ అయితే ఇంకో సారి సీరియస్ ఫైట్. ఆ మధ్య నీతి ఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్ తో కేరళలోని తలాసెరి ఫిష్ బిర్యానీ గొప్పదా లేక హైదరాబాద్ దమ్ బిరియానీ గొప్పదా అన్న విషయంపై ట్వీట్లు దూశారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ట్వీట్ వార్ ప్రకటించారు. “మీకెంత.... మాకెంత” అన్న విషయంలో ఆయన నిర్మలా సీతారామన్ తో వాదనకు దిగారు.

తెలంగాణకు ఇవ్వాల్సినంత ఇవ్వలేదని కేటీఆర్ వాగ్యుద్ధానికి తెరతీశారు. దీంతో తెలంగాణకు తాము మిగతా రాష్ట్రాలకు ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. కేటీఆర్ తక్షణమే “మీరు ఇవ్వడం ఏమిటి? అసలు ఇవ్వడం అన్న పదంలోనే అహంకారం కనిపిస్తోంది. మీరేదో మా పట్ల దయచూపుతున్నట్టు అనిపిస్తోంది. నిజానికి మేమే మీకు ఇచ్చాం. మేం ఇచ్చిన దానిలోనుంచే మీరు తిరిగి ఇచ్చారు” అని కేటీఆర్ మళ్లీ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా మేం మీకెంత ఇచ్చాం, మీరు మాకెంత ఇచ్చారు అని ప్రతి ఏడాది లెక్కలు ఆమెకు అప్పచెప్పారు. మళ్లీ మన నిర్మలమ్మ ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదు. కానీ మాటల యుద్ధం కొనసాగే లక్షణాలే కనిపిస్తున్నాయి. కేంద్రానికి పన్నుల రూపంలో రాష్ట్రం 2.73 లక్షల కోట్లు ఇచ్చిందని, కేంద్రం అందులో నుంచి 1.12 లక్షల కోట్లు తిరిగి రాష్ట్రానికి ఇచ్చిందని, కేంద్రం 1.60 లక్షల కోట్ల రూపాయలు తనవద్దనే ఉంచుకుందని కేటీఆర్ తన ట్వీట్ లో లెక్క చెప్పారు.

అసలు తెలంగాణ ఎంత ఇస్తోందో, ఎంత తెచ్చుకుంటోందో దేశానికి తెలియాలని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మీరు మాకు ఇవ్వడం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు. ఇందులో కేంద్రం దురహంకారం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేటాయింపులు, చెల్లింపుల విషయంలో చాలా కాలంగా వాగ్వివాదం కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ అప్పుడప్పుడూ మాటల యుద్ధం, ట్వీటుల యుద్ధం చేస్తునే ఉన్నారు. మాకు మీరు అదనంగా ఏమీ ఇవ్వడం లేదని కేటీఆర్ వాదిస్తూనే ఉన్నారు. మొత్తం మీద రాష్ట్రం, కేంద్రాల మధ్య వీధి కుళాయిల వద్ద జరుగుతున్న వాదనల్లాంటివే జరుగుతున్నాయి. వీధి కుళాయికి బద్దులు ట్విట్టర్ వేదిక దొరికింది. అంతే తేడా!!





Next Story