తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
By తోట వంశీ కుమార్ Published on 7 Sept 2020 12:06 PM ISTతెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉదయం 11గంటలకు ప్రారంభం అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారినే లోపలికి అనుమతించారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్పోనేలా అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. వారి సేవలను శాసన సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు.
దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ పేరు లేని పేజీ ఉండదన్నారు సీఎం కేసీఆర్. పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన ఆయన భారత మాత ప్రియపుత్రుడుగా ఎదిగారని కొనియాడారు. జఠిల సమస్యలను పరిష్కరించడంలో ఆయన నేర్పరి అని ప్రశంసలు కురిపించారు. మిత్రపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకున్న నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంట్‌లో తప్పు దొర్లితే వెంటనే క్షమాపణ కోరేవారంటూ గుర్తుచేసిన ఆయన.. తెలంగాణ సాధనలో ప్రణబ్ పాత్ర ఉందని, ప్రజల ఆలోచన అర్థం చేసుకుని అధిష్టానానికి నచ్చచెప్పారని, తెలంగాణ బిల్లుపై ఆయనే సంతకం చేశారని కూడా చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక వేత్తగా పేరుతెచ్చుకున్నారని అని కేసీఆర్ సభకు తెలిపారు.