కాఫీ తాగుతుంటే పాక్ అభిమాని తిట్టడం మొదలుపెట్టాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Jun 2020 1:35 PM ISTభారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ జరిగే ముందు జరిగిన ఘటనలను బయటపెట్టాడు. మాంచెస్టర్ తో వరల్డ్ కప్ మ్యాచ్ కు ముందు తమను పాకిస్థాన్ అభిమానులు తిట్టారని చెప్పుకొచ్చాడు.
భారత్ ఆర్మీ పోడ్ కాస్ట్ కు శంకర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ కు ఒక్కరోజు ముందు తాను కాఫీ తాగడానికి ఇతర టీమ్ మేట్స్ తో కలిసి వెళ్ళినప్పుడు పాకిస్థాన్ జట్టు అభిమాని తమ దగ్గరకు వచ్చాడని.. వెంటనే తిట్టడం మొదలుపెట్టాడని చెప్పుకొచ్చాడు. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సమయంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడే తనకు అర్థం అయిందన్నాడు.
అతడు మమ్మల్ని తిడుతుండడాన్ని రికార్డు చేస్తూ వచ్చాడని.. తామందరూ సైలెంట్ ఉండిపోయామని.. అతడు ఏమేమి చేస్తున్నాడో చూస్తూ ఉన్నామని తెలిపాడు.
ఇక మ్యాచ్ కు ఒక్కరోజు ముందు నువ్వు పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కు సిద్ధంగా ఉండాలని తెలిపారని అన్నాడు. ఆ మ్యాచ్ లో విజయ్ శంకర్ 15 పరుగులు చేయగా... బౌలింగ్ తీసుకుని వేసిన మొదటి బంతికే వికెట్ తీశాడు. వరల్డ్ కప్ లో ఈ రికార్డు సాధించిన మూడో బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో భారత్ 50 ఓవర్లలో 336 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు. పాకిస్థాన్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 40 ఓవర్లలో కేవలం 212 పరుగులు మాత్రమే చేయగా భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయ్ శంకర్ ఈ మ్యాచ్ లో 5.2 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు.