సచిన్‌ కాదు.. విరాట్‌ కాదు.. ఒకే ఒక్కడు రాహుల్‌ ద్రావిడ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 1:23 PM GMT
సచిన్‌ కాదు.. విరాట్‌ కాదు.. ఒకే ఒక్కడు రాహుల్‌ ద్రావిడ్

ప్రపంచానికి ఎంతో మంది గొప్ప బ్యాట్స్ మెన్లను పరిచయం చేసింది భారత్. భారత బ్యాట్స్‌మెన్లు టన్నుల కొద్ది పరుగులు చేస్తారనే పేరు ఉంది. మరీ భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ టెస్టు ఆటగాడు ఎవరు అన్న ప్రశ్న అందరి మదిలో ఉంది. అయితే.. చాలా మంది సచిన్‌ అని, మరి కొంత మంది విరాట్‌ కోహ్లీ అని, ఇంకొంత మంది రాహుల్‌ ద్రావిడ్‌ అని, ఇంకొందరు లక్ష్మణ్‌ అని అంటారు.

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌ ఆడిన సచిన్‌ టెస్ట్‌, వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. క్రికెట్‌ దేవుడిగా కీర్తి గడించాడు. సచిన్‌కు స్వదేశంలోనూ, విదేశాల్లో ఫ్యాన్స్‌ సొంతం. తాజాగా విజ్డెన్‌ ఇండియా నిర్వహించిన పోల్‌ లో మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్వం అయింది. గత 50 ఏళ్లలో భారత గొప్ప టెస్టు బ్యాట్స్‌ మెన్‌ ఎవరు అనే ప్రశ్నతో విజ్డెన్‌ ఇండియా ఓ పోల్‌ ను నిర్వహించింది.

ఈ పోల్‌లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ది వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ 52 శాతం ఓట్లతో విజేతగా నిలిచాడని, రెండవ స్థానంలో సచిన్‌, విరాట్ కోహ్లీ మూడు, సునీల్‌ గవాస్కర్‌ నాలుగో స్థానానికి పరిమితమైయ్యారని విజ్డెన్‌ ఇండియా ప్రకటించింది. టీమ్‌ఇండియా తరుపున ద్రావిడ్ 164 టెస్టులాడి 63 అర్థశతకాలు, 36శతకాలు బాది 13,288 రన్స్ చేసాడు. 200 టెస్టులో టెండూల్కర్ 15,921, 125 టెస్టుల్లో గవాస్కర్ 10,122, చివరగా ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 86 టెస్టుల్లో 7,240 పరుగులు చేశాడు.

ఇండియాకు పెట్టని కోట రాహుల్‌ ద్రావిడ్‌. అభిమానులు అంతా అతడిని ముద్దుగా ది వాల్ అని పిలుచుకుంటారు. ఎన్నో సార్లు ఒంటరి పోరాటం చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. భారత జట్టు రూపురేఖలు మార్చిన 2001 కోల్‌కత్తా టెస్టులో లక్ష్మణ్‌తో కలిసి రికార్డు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న ప్లేయర్‌గా రికార్డు ద్రావిడ్‌ సొంతం. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉండే ఆటగాడు. ఈ విషయాన్ని గంగూలీతో సచిన్‌ తో పాటు చాలా మంది క్రికెటర్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. సచిన్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ద్రావిడ్‌ అవతలి ఎండ్‌లో ఉంటే.. తాను స్వేచ్చగా బ్యాటింగ్‌ చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే.. టెస్టుల్లో ద్రావిడ్‌ పుట్‌వర్క్‌, టెక్నిక్‌ అద్భుతం. గంటల తరబడి క్రీజులో బ్యాటింగ్‌ చేయగల నేర్పరి. ద్రావిడ్‌ వికెట్‌ తీయడం అంత తేలిక కాదు.

Next Story