ఉపాధ్యాయులు కావలెను.. ఇండియాలో మాత్రం కాదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Dec 2019 2:11 PM IST
ఉపాధ్యాయులు కావలెను.. ఇండియాలో మాత్రం కాదు..!

ఉపాధ్యాయులు కావలెను.. ఈ ప్ర‌క‌ట‌న ఈ దేశానికి సంబంధించింది కాదు.. కానీ ఈ దేశం వాళ్ల‌కు ప‌నికొచ్చేది. అవును అమెరికాకు అర్జంటుగా ఉపాధ్యాయులు కావాలంట‌. ఇందుకోసం అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్ధులు ఎవ‌రైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి స్కూళ్ల‌ల్లో మ్యాథ్స్‌, సైన్స్ సబ్జెక్ట్‌ల‌ను భోధించ‌డానికి నైపుణ్యం కలిగిన అభ్య‌ర్ధుల‌ నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్) అధ్యక్షుడు మేడపాటి వెంకట్ తెలిపారు.

మొత్తం 50 పోస్టులు ఖాళీలున్నాయ‌ని.. అక్లెమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ఆధ్వర్యంలో.. టెక్సాస్‌లోని స్కూళ్ల‌ల్లో ఈ ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంటుందని మేడ‌పాటి వెంక‌ట్ తెలిపారు. ఎంపిక‌యిన ఉపాధ్యాయ అభ్య‌ర్ధుల‌కు మూడేళ్ళ గడువుండే జే1 వీసాలను మంజూరు చేస్తారని అన్నారు. వీసాలను మరో రెండేళ్ళు పొడిగించేందుకు అవకాశముంటుందని తెలిపారు.

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్ధులు బీఈడీ / ఎంఈడీ అర్హత ఉండి, బోధనలో ఐదేళ్ళకు పైబడి అనుభవం ఉండాలి. వీసాలు పొందేందుకై టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అర్హతలు ఉండి.. ఆసక్తి గ‌ల‌ అభ్యర్ధులు... https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs వెబ్‌సైట్ ద్వారా జనవరి 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చ‌ని తెలిపారు.

Next Story